మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి!

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కోరితే ముందే సర్వేచేసి ఫలితాలు వెల్లడిస్తామని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌ పూర్తయిన మరుక్షణమే కచ్చితంగా సర్వేఫలితాలు వెల్లడిస్తానన్నారు. దిల్లీలో ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌- టీడీపీ పొత్తులు విజయవంతమవుతాయా? అని విలేకర్లు అడగ్గా.. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలే చెప్పాలని వ్యాఖ్యానించారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, టికెట్ల పంపిణీ, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారో తెలిస్తే ఓ అంచనాకు రావొచ్చన్నారు.

ప్రజల మనోభావాలేంటో, వారి నాడి ఎలా ఉందో, ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలుసుకొని డిసెంబర్‌ 7 తర్వాత సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎవరినైనా కలవొచ్చన్నారు. 2014లో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సర్వే ఫలితాలు చెప్పానన్నారు. సర్వే ఫలితాలపై తాను ఇప్పుడు ఏది చెప్పినా కొందరికి నచ్చవచ్చు.. ఇంకొందరికి నచ్చకపోవచ్చన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, వాటి గురించి ఇప్పుడేం మాట్లాడినా తాను రాజకీయంగా ఏదో ఆశించే ఇలా మాట్లాడుతున్నట్టు భావించే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్‌-టీడీపీ పొత్తులు, తన రాజకీయ భవితవ్యంపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి రాజకీయాల్లో పొత్తులు ఉంటాయని, బీహార్‌లో బద్ధ విరోధులు కూడా కలిశారని గుర్తు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కలవడం అరుదుగానే జరుగుతుంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే తెలంగాణలో ఎంపీగా పోటీచేస్తానని వెల్లడించారు. మెదక్‌జిల్లాకు వెళ్లినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలని అక్కడి ప్రజలు తనను అడిగారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్నికల్లో పోటీచేయనని స్పష్టంచేశారు. భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని ఎదగకూడదనే తాను రాజకీయాల్లోంచి తప్పుకున్నానన్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సహా ఎవరిపై దాడి జరిగినా ఖండించాల్సిందేనన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates