(మా) అధ్యక్షుడిగా ‘నరేశ్‌’ విజయం

తెలుగు సినీనటుల సంఘం (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేశ్‌‌ విజయం సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేశ్‌కు 268ఓట్లు పోలయ్యాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్‌ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం విశేషం. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్‌, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, ఉత్తేజ్‌, పృథ్వి, జాకీ, సురేశ్‌ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్‌, సమీర్‌, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, తనీష్‌, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్‌, పసునూరి శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల్లో నటులు నరేశ్‌, శివాజీ రాజా ఆధ్వర్యంలోని ప్యానళ్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ‘మా’ అసోసియేషన్‌లో మొత్తం 745 ఓట్లు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మా’ ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్‌ నమోదవడం ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో తొలి ఓటును నటుడు నరేశ్‌ వేయగా.. చివరి ఓటును అలనాటి హాస్య నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నారు. సినీరంగానికి చెందిన ప్రముఖులంతా ఫిల్మ్‌ఛాంబర్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా.. ఈ సారి పోలింగ్‌కు బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.

CLICK HERE!! For the aha Latest Updates