మహర్షి సక్స్‌స్‌ మీట్‌లో కాలర్ ఎగరేసిన మహేష్‌బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్ హీరోగా నటించారు. పూజా హెగ్డే హీరోయిన్‌ . ఈ సినిమా మే 9న విడుదలై, మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో విజయాన్ని పురస్కరించుకుంటూ ఆదివారం చిత్ర బృందం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి యూనిట్‌ సభ్యులు హాజరై, సినిమాతో తమకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వేడుకలో వంశీ పైడిపల్లి భావోద్వేగానికి గురయ్యారు.

వంశీ పైడిపల్లి : ‘నిజంగా చాలా ఎమోషన్‌లో ఉన్నా. ఇవాళ మాతృ దినోత్సవం.. మా అమ్మ నన్ను చిన్నతనం నుంచి చాలా ప్రోత్సహించారు. నేను సాఫ్ట్‌వేర్‌ వదిలేసి.. సినిమాలకు వచ్చినప్పుడు నా వెంట ఎవరూ లేరు. ప్రపంచం నన్ను నమ్మలేదు. మా అమ్మ ఒక్కరే నన్ను నమ్మారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత మా అమ్మ, నాన్న నన్ను పట్టుకుని ఏడ్చారు. దానికి మించిన సక్సెస్‌ నాకు మరొకటిలేదు. నన్ను ఇలా పెంచినందుకు థాంక్స్‌ అమ్మ’.

‘ప్రీ రిలీజ్‌ రోజే అందరికీ ధన్యవాదాలు చెప్పా. ఈ సినిమా కోసం పనిచేసిన వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు దత్‌ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ సినిమా చూసి నాకు పిచ్చి పుట్టింది. ఆ సినిమా కోసం గోడలు దూకి మా నాన్న దగ్గర తిట్లు తిన్నాను. ఇవాళ ఆయన బ్యానర్‌లో సినిమా చేశా. ఇది నా అదృష్టం. మీ ఆదరణకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. నేను నరేష్‌ తండ్రి ఈవీవీ సత్యనారాయణకు అభిమానిని. ఇవాళ ఆయన ఉంటే బాగుండేది’.

‘వంశీ నా సోదరుడని మహేష్ అన్నారు. అవి కేవలం మాటలే కాదు.. నిజంగా ఆయన నాతో అలా ఉన్నారు. మీ గురించి మాట్లాడుతుంటే ఎమోషన్‌కు గురవుతున్నా.(కంటి నిండా కన్నీళ్లతో). మీరు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మీ ఇంట్లోకి చాలా మంది దర్శకులు వస్తుంటారు, కథలు చెబుతుంటారు, వెళ్తుంటారు. కానీ రెండు రోజుల ముందు నేను మీ కుటుంబ సభ్యులతో కలిసి హోమ్‌ థియేటర్లో సినిమా చూశా. అదే నా విజయంగా భావిస్తున్నా (చప్పట్లు). ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. మహేష్ నా పక్కన కూర్చుని, చేయి పట్టుకుని.. ‘వంశీ నువ్వు ఓ క్లాసిక్‌ తీశావు.. నా మాటలు నమ్ము’ అన్నారు. ఆయన చెప్పిన మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. మహేష్ జీవితంలో అన్నీ సాధించారు‌. ఇవాళ ‘మహర్షి’ ఇలా ఉంది అంటే అందులో 80 శాతం క్రెడిట్‌ ఆయనకే వెళ్తుంది. ఈ సందర్భంగా మహేశ్‌ అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మనసుతో ఈ సినిమా చూశారు. ఒక రైతు దూరం కావడం వల్ల.. ఎంత నష్టపోతున్నామని ఆలోచింపచేసే సినిమా ఇది. రైతుల మీద మనం సానుభూతి చూపడం కాదు.. మనపై మనం సానుభూతి చూపించుకోవాల్సిన సమయం వచ్చింది’.

మహేష్‌ బాబు: ‘ముందు సుమకు ధన్యవాదాలు. అడిగిన వెంటనే వచ్చారు. మీరు వస్తే నాకు ఎందుకో ఓ ఎనర్జీ ఉంటుంది. ఫంక్షన్‌కే ఓ కళ వస్తుంది. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు.. మాతృ దినోత్సవం. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ నా సినిమా విడుదలకు ముందు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతా. అలా కాఫీ తాగితే నాకు దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం’.

‘దేవిశ్రీ నువ్వు నిజంగా రాక్‌స్టార్‌. దేవి లేకుండా నేను సినిమాల్లో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే.. నాకు దేవి అంటే ప్రాణం. ‘పదరా పదరా..’ పాట చూసినప్పుడల్లా నాకు కళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి. దత్‌ ఈ కథ విని.. ఈ సినిమా ఓ గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని అన్నారు. నేను క్రికెట్‌కు పెద్ద అభిమానిని. ఇండియా-శ్రీలంక ప్రపంచ కప్‌ను బాంబేలో చూశా. ధోనీ చివరి బాల్ 6 కొట్టారు. అప్పుడు విపరీతంగా చప్పట్లు కొట్టాను. దిల్‌రాజు ఈ సినిమాను ఉద్దేశించి సిక్సర్‌ అన్నారు. ధోనీ 6 కొట్టినప్పుడు కల్గిన ఆనందం ఇప్పుడు కల్గింది. ఈ సినిమా పోస్టర్‌ చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. మూడు గొప్ప బ్యానర్లు అందులో ఉన్నాయి’.

‘దత్‌ నన్ను ఎప్పుడూ ప్రిన్స్‌ అని పిలుస్తుంటారు. కానీ నాపై ఇష్టం పెరిగినప్పుడు మాత్రం మహేశ్‌ అంటుంటారు. ఆయన నుంచి ఆ పిలుపు కోసం నేను ఎదురుచూస్తుంటాను. ఆయన ఈ సినిమా చూసినప్పుడు.. ‘మహేశ్‌ ఈ సినిమా నాకు ఇచ్చినందుకు థాంక్స్‌’ అన్నారు. ఆ ప్రశంసను నేను మర్చిపోలేను. నా కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్స్‌ను ‘మహర్షి’తో ఒక వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించింది నాకు ఏమీ లేదు. ఈ సినిమాలో నటించినందుకు నరేష్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు ఇంత పేరువచ్చినందుకు కారణం మీరు కూడా. వంశీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘మహర్షి’ విడుదల తర్వాత నాన్న అభిమానులు, నా అభిమానులు కాలర్‌ ఎత్తుకుని తిరుగుతారు అన్నారు. వాళ్లు కాలర్‌ ఎత్తారు వంశీ.. ఇప్పుడు నేను కూడా కాలర్‌ ఎత్తుతున్నా. (అంటూ.. మహేశ్‌ కాలర్‌ ఎగరేశారు..ఆనందంలో వంశీ మహేశ్‌ను కౌగిలించుకున్నారు)

అశ్వనీ దత్‌: ‘ఈ సెన్సేషన్‌ హిట్‌కు కారణం సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కృష్ణ సూపర్‌హిట్లు అన్నీ రైతు నేపథ్యం నుంచి వచ్చిన సినిమాలే. నేను ఎప్పుడు కృష్ణని కలవడానికి ఇంటికి వెళ్లినా ప్రతిసారి ఆయన తల్లి నాగరత్నమ్మ నాకు ఓ మాట చెప్పేవారు. తను రైతుగా ఎంత కష్టపడ్డారు, ఎలాంటి పంటలు పండించారు అని ఆమె చెప్పేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మహేష్ 25వ సినిమా రైతులకు సంబంధించిన కావడం గొప్ప విషయం. శ్రీమణి అన్నట్లు ఎన్నో సినిమాలు హిట్లు అవుతాయి.. కొన్ని సినిమాలే గౌరవాన్ని తీసుకొస్తాయి. మే 9న విడుదల చేసిన నా మూడు సినిమాలు చిరంజీవికి (‘జగదేక వీరుడు అతిలోక సుందరి’), సావిత్రికి (‘మహానటి’), ఇవాళ మహేష్ కి ఎంతో గౌరవాన్ని తెచ్చాయి. ‘మహర్షి’ అద్భుతమైన కలెక్షన్స్‌ రాబడుతోంది’.

దిల్‌రాజు: ‘ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో నేను చాలా ఎమోషనల్‌గా, ఎక్కువ మాట్లాడా. ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి నాకున్న నమ్మకమే నాతో అలా మాట్లాడించింది. అది ఇవాళ నిజమైంది. దానికి చాలా గర్వంగా ఉంది. మహేశ్‌ 25వ సినిమా ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌ కావడం ఆనందంగా ఉంది. ఆయన ఎన్నో కమర్షియల్‌ సినిమాలు తీశారు. కానీ సమాజానికి ఉపయోగపడేలా ఉండటం గర్వించాల్సిన విషయం. ఈ విజయాన్ని మేం (టీం) ముందే ఊహించాం.. ఇవాళ దాన్ని చూస్తున్నాం. మొత్తం చిత్ర బృందం చాలా కష్టపడింది. ప్రొడక్షన్‌, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోని వారు చాలా శ్రమించారు. వంశీ వాళ్లందరి బెండు తీశారు(నవ్వులు). వంశీ నుంచి ఫోన్‌ కాల్‌ వస్తే నాకు టెన్షన్‌ వచ్చేసేది.. ఏం చెబుతాడో, ఏమైందో అనుకునేవాడిని (నవ్వులు)’.

‘సినిమా విడుదలైన రోజు తెల్లవారుజామున లండన్‌ నుంచి 3.30 గంటలకు ఫోన్‌ వచ్చింది. సినిమా మామూలుగా లేదు సర్‌.. చాలా బాగుంది అన్నారు. మూడు రోజుల క్రితం తిరుమల పూజారి ఫోన్‌ చేసి గొప్ప సినిమా చేశారు అన్నారు. ఇలాంటి ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రేక్షకుల హృదయాల్లో ఈ సినిమా నిలిచిపోయింది. వంశీ గొప్ప సినిమా తీశావ్‌. ధన్యవాదాలు.. ఈ సినిమాను నిలబెట్టుకోవడం నీకు ఇకపై సవాలు. సినిమా అన్ని లొకేషన్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. నా పంపిణీదారులకు ధన్యవాదాలు చెప్పాలి. ‘భరత్‌ అనే నేను’కు ఎంత కట్టారో.. ఈ సినిమాకు కూడా అంత కట్టండి అని అడిగా. వారు ఎందుకు అని అడగకుండా, ఆలోచించకుండా.. డబ్బులు పంపారు. వాళ్లు ఇప్పుడు ఫోన్‌ చేసి.. ఎంతో ఆనందపడుతున్నారు. మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉందని చెప్పారు.

దేవిశ్రీ: ‘ముందు దిల్‌రాజు గురించి చెబుతా. ఆయన నిర్మాతలా కాకుండా, ఓ కుటుంబ సభ్యుడిలా ఉంటారు. ఆయన సక్సెస్‌కు ఓ ఉదాహరణ నేను చెబుతా.. ‘మహర్షి’ కోసం అశ్వినీదత్‌తో అసోసియేట్‌ అవుతున్నామని దిల్‌రాజు ఓ రోజు నాకు చెప్పారు. ‘ఆయన గొప్ప నిర్మాత. ఆయన సినిమాలు నాకు స్ఫూర్తి’ అని అన్నారు. అది విని నేను ఆశ్చర్యపోయా. ప్రస్తుతం టాలీవుడ్‌ దిల్‌రాజు బ్యానర్‌పై నడుస్తోంది అనడంలో ఆశ్చర్యం లేదు. కానీ అలాంటి ఆయన మరో నిర్మాత స్ఫూర్తి అనడం గొప్ప. ఆయనతో ప్రయాణం అంటే.. కేవలం ఓ సినిమా తీయడం మాత్రమే కాదు.. దానికి మించిన ఎమోషన్‌’.

‘ఈ సినిమా ప్రారంభం కాకముందు ‘భరత్‌ అనే నేను’ షూటింగ్‌ సమయంలో మహేష్‌ ను చెన్నైలో కలిశా. ‘వంశీ మంచి స్క్రిప్టు చెప్పారు. చాలా బాగుంది. ఆయనకు వృత్తిపరంగా చాలా నిబద్ధత ఉంది. ఎప్పుడూ చూసినా.. సినిమా, సినిమా.. అంటుంటాడు’ అని మహేశ్‌ నాతో అన్నారు. అప్పుడు నేను వంశీ స్నేహితుడిగా గర్వపడ్డా. ఈ విషయాన్ని మహేష్‌ అనుమతి లేకుండా వంశీకి ఫోన్‌ చేసి చెప్పేశా. మహేష్‌ టెక్నీషియన్లకు చాలా గౌరవం ఇస్తారు. నేను కలిసిన ప్రతి దర్శకుడు మహేష్‌తో కలిసి పనిచేయాలి అన్నవారే. మహేష్‌ లాంటి స్టార్‌కు సినిమాను హిట్‌ చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఓ మంచి సందేశం ఉన్న సినిమా చేయడమే స్టార్‌డమ్‌. అందుకే మీరు టాప్‌లో ఉన్నారు మహేష్‌‌. అల్లరి నరేష్‌ సినిమాలో గొప్పగా నటించారు. మహేష్‌తో చాలా సినిమాలు చేశాను. ఆయనతో నాకు ఏదో బంధం ఉందని ఎప్పుడూ అనిపిస్తుంటుంది. ఈ సినిమా చూసి మా అమ్మ ఏడుస్తూ ఫోన్‌ చేశారు. సినిమా చాలా బాగా చేశారు. ఏడుపు వచ్చేసింది అన్నారు’. అల్లరి నరేష్‌: ‘ఈ సినిమాతో నా ప్రయాణం అక్టోబరు 13న మొదలైంది. వంశీ గారి నుంచి ఫోన్‌ వచ్చింది. మాట్లాడాలి అన్నారు. వచ్చారు.. కథ నరేట్‌ చేశారు. నేను మొత్తం విన్న తర్వాత.. ‘సర్‌ ఈ పాత్రకు మీరు నన్ను ఎలా ఊహించుకున్నారు’ అని అడిగా. ఎందుకంటే నేను కామెడీ చేసుకుంటూ వచ్చాను. అలాంటిది నాలో ఈ కోణం ఎలా చూశారు అనుకున్నా. నేను ఓ సీరియస్‌ పాత్రను కూడా చేస్తానని నమ్మిన వంశీ, మహేష్‌ కు ధన్యవాదాలు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ఎంతో బాగా నటించారు’. ‘ఈ సినిమా షూట్‌లో ఒక్కచోట ఏడుపొచ్చింది సర్‌ అని నేను వంశీతో అంటే.. కాదు మీరు ఏడు చోట్ల ఏడ్చారు అని అన్నారు. అంతలా ప్రతిదీ గమనించేవారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే.. 71వ సీన్‌ ఏంటి అని అడిగితే.. ఆయన ఇప్పుడు ఇక్కడే చెప్పేస్తారు. పేపర్‌ చూడాల్సిన అవసరం లేదు. స్క్రిప్టు అంతగా గుర్తు పెట్టుకుంటారు. మహేష్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు సరదాగా ఉండేవారు. కానీ సీరియస్‌ సీన్‌ చేయాలంటే అదే మూడ్‌లో రోజంతా ఉండేవారు. పర్‌ఫెక్ట్‌గా షాట్‌ రావడానికి ఇలా చేసేవారు. ఇవాళ మా నాన్న ఉండి ఉంటే చాలా గర్వపడేవారు. ఓ దర్శకుడిగా, ఓ రైతుగా ఆనందపడేవారు. మనం చాలా సినిమాలు చేస్తుంటాం.. పేరు వస్తుంది. కానీ కొన్ని సినిమాలకే గౌరవం వస్తుంది. ‘మహర్షి’ నాకు ఆ గౌరవాన్ని ఇచ్చింది. ‘విడుదల తర్వాత మీకు ఎన్ని ఫోన్లు వస్తాయో చూడండి’ అని వంశీ అన్నారు. నాకు చాలా మంది ఫోన్‌ చేశారు. హిట్‌ అన్న పదం నేను విని నాలుగేళ్లు అయ్యింది. నాకైతే ఎక్కడికైనా వెళ్లిపోయి గట్టిగా అరవాలి అనిపించింది. సక్సెస్‌లకు కామాలే ఉంటాయి.. పుల్‌స్టాప్‌లు ఉండవు’.

CLICK HERE!! For the aha Latest Updates