అసెంబ్లీ సెట్ లో మహేష్!

మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ‘స్పైడర్’ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసిన మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్దిరోజుల క్రితమే మొదలైనా.. మహేష్ మాత్రం ఈరోజు నుండి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో అసెంబ్లీ సెట్ వేశారు.

మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించే కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే మహేష్ ముఖ్యమంత్రి గెటప్ లో ఎలా కనిపిస్తాడనే.. ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పట్లో ఈ లుక్ బయటకి రాకుండా ఉండే విధంగా దర్శకుడు కొరటాల శివ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే సెట్ లోకి ఎవరినీ ఫోన్లతో అనుమతించడం లేదు. ఈ ఏడాది చివరికి సినిమాను పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.