ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా.. ఉత్కంఠ భరితంగా ‘మహర్షి’ ట్రైలర్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహర్షి’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విక్టరీ వెంకటేష్‌ ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. మహేష్‌ క్లాస్‌, మాస్‌ లుక్‌లో కనిపించి, ఆకట్టుకున్నారు. ‘ఏం సాధిద్దాం అనుకుంటున్నావు రిషి’ అని రావు రమేశ్‌ ప్రశ్నిస్తే.. ‘ఏలేద్దాం అనుకుంటున్నాను సర్‌. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. విజయాన్ని ఎలా లెక్కిస్తాం సర్‌ అని విలేకరి మహేష్‌ను ప్రశ్నిస్తే.. ‘గతంలో ఎక్కడ ఉన్నాం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం.. దాన్ని బట్టి మనకే అర్థం అవుతుంది..’ అని ఆయన అన్నారు. ‘ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం..’ అంటూ ఎంతో ఉత్కంఠ భరితంగా ట్రైలర్‌ సాగింది.

‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.