మణిరత్నం ‘నవాబ్’ పై మహేష్‌ ప్రశంసలు

దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నవాబ్’‌. కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న మణిరత్నం.. నవాబ్‌ సినిమా తో తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు ఫ్యాన్స్‌. భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేష్ బాబు నవాబ్‌ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు.

‘చెక్క చివంత వానం(తెలుగులో నవాబ్‌)’ అద్భుతమైన నటన.. ఏఆర్‌ రెహమాన్‌కు మాత్రమే సాధ్యమైన మ్యూజిక్‌, సంతోష్‌ శివన్‌ క్లాస్‌ సినిమాటోగ్రఫి. మణిరత్నం అభిమానిగా చెన్నై థియేటర్లలో చప్పట్లు కొడుతూ ఆయన సినిమాలు చూశాను. ఇప్పుడు అదే పని నా హోం థియేటర్లో గర్వంగా చేశాను. ఇంకా మీరు సినిమా చూడనట్టైతే వెంటనే వెళ్లి టికెట్స్‌ తీసుకోండి. ఓ క్లాసిక్‌ చూసిన భావన కలుగుతుంది. ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం. ద మాస్టర్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ పొగడ్తలతో ముంచేశారు. ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, అరవింద్‌ స్వామి, సింబు, అరుణ్‌ విజయ్‌, విజయ్‌ సేతుపతి, జయసుధ, ఐశ్వర్యా రాజేశ్‌, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషించారు.