‘మణికర్ణిక’ టైటిల్ లోగో!

తెలుగులో “గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందింపజేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ లోనూ “గబ్బర్ ఈజ్ బ్యాక్”తో తన సత్తాను చాటుకొన్నాడు. ఆయన తాజాగా తెరకెక్కించనున్న బాలీవుడ్ చిత్రం “మణికర్ణిక”. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చారిత్రక చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తోంది. 
జీ స్టూడియోస్ సమర్పణలో కమల్ జైన్ ఈ చిత్రాన్ని కైరోస్ కంటెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చుతున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీత దర్శకత్వం వహించనున్నారు. 
“మణికర్ణిక” టైటిల్ లోగో విడుదల మరియు రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ కార్యక్రమం వారణాసిలో జరిగింది. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందం వారణాసిలో 20 అడుగుల పొడుగు “మణికర్ణిక” టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది.. అనగా ఏప్రిల్ 27, 2018 విడుదల చేస్తున్నట్లు తెలిపారు!