డిజిటల్‌ రంగంలోకి మీనా..

‘బాలనటిగా ప్రేక్షకులకు పరిచయమై.. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన నటి మీనా. ఆమె రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున ఇలా.. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో కలిసి తెరపై సందడి చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె తెలుగు సినిమా ‘సాక్ష్యం’లో (2018) అతిథిగా కనిపించారు. కాగా ఇప్పుడు మీనా డిజిటల్‌ సిరీస్‌లో సందడి చేయబోతున్నారు. ‘కరోలిన్‌ కామాక్షి’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. వివేక్‌ కుమార్‌ కన్నన్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనా సీబీఐ ఏజెంట్‌ పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో ఇటలీకి చెందిన మోడల్‌ జార్జియా ఆండ్రియానీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా సిరీస్‌ నిర్మాత చిదంబరం నటేశన్‌ మాట్లాడుతూ.. ‘మేం మీనాను వెబ్‌ సిరీస్‌కు పరిచయం చేస్తుండటం గర్వంగా ఉంది’ అని అన్నారు. మరోపక్క మీనా ఇటీవల ‘షైలాక్‌’ అనే మలయాళ చిత్రానికి సంతకం చేశారు. ఇందులో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు.