‘మురారి’ దీక్షితులు కన్నుమూత

ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్‌ దీక్షితులు కన్నుమూశారు. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో నాచారం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దీక్షితులు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన మురారి చిత్రంలో దీక్షితులు పూజారి పాత్రలో నటించారు. ఇంద్ర, ఠాగూర్‌, అతడు, వర్షం తదితర విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి పలువురు సినీ, టీవీ నటులు సంతాపాన్ని ప్రకటించారు.