జాతీయ పార్టీల్లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది: కొండా

చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిన్న టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి .. ఇవాళ హస్తినకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీకి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా కూడా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. రాహుల్‌గాంధీతో భేటీ కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీపరమైన నిర్ణయాలు నచ్చకే టీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చానని వెల్లడించిన కొండా.. ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరతానని రాహుల్‌కు చెప్పినట్టు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని విమర్శించారు కొండా… నా నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్న ఆయన… అధికార పార్టీ ఎంపీగా ఉండి సమస్యలు పరిష్కరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. నా నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించామన్నారు.. సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని రాహుల్ తెలిపారని వెల్లడించారు. ఈ భేటీలో వికారాబాద్, తాండూరు సమస్యలను కూడా చర్చించామన్నారు. తాను వ్యక్తిగత వైరాలతో పార్టీని వీడలేదన్న ఆయన.. వ్యక్తిగత విభేదాలతో అయితే నాలుగేళ్ల క్రితమే తాను బయటకు వచ్చేవాడినన్నారు. పార్టీ సిద్ధాంతాలను విభేదించే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. మొదట్లో కేసీఆర్ మంచి పథకాలు చేపట్టినా… క్రమంగా పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. జాతీయ పార్టీల్లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని… రీజనల్ పార్టీల్లో అది ఉండదన్నారు కొండా.