డ్రగ్స్ కేసులో ముమైత్ కు మినహాయింపు!

టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం సంచలనంగా మారింది. చిత్రసీమకు చెందిన చాలా మంది సెలబ్రిటీలను నేటి నుండి విచారించనున్నారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ తో ఈ విచారణ మొదలైంది. పూరి తన తమ్ముడు సాయిరామ్ శంకర్, ఆకాష్ పూరిలతో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. 20వ తేదీన ఛార్మి, 21 ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యామ్ కె నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా , 26న నవదీప్, 27న తరుణ్, 28న నందు, 29న తనీష్ లు విచారణకు హాజరు కానున్నారు. ప్రతిరోజూ ఉందయం 10:30 గంటలకు డ్రగ్స్ పై విచారణ ప్రారంభం కానుంది. అయితే ముమైత్ ఖాన్ ను విచారణ నుండి ప్రస్తుతానికి మినహాయింపు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నోటీసులు జారీ చేసిన వారిలో ముమైత్ ఖాన్ మినహా మిగిలిన అందరూ హాజరవుతారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సబర్వాల్ తెలిపారు. ఆమె టీవీషోలో ఉన్న కారణంగా విచారణ తేదీను ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు.
వాస్తవానికి ఆమె హైదరాబాద్ లో ఓ అడ్రెస్ లో ఉంటుందని తెలుసుకున్న పోలీసులు అక్కడకి నోటీసులు పంపినా ఆమె అక్కడ నుండి ఖాళీ చేసి చాలా రోజులైందని తెలియడంతో పోలీసులు ఆమెకు నోటీసులు అందించడంలో విఫలమయ్యారు. పోలీసులు నోటీసులు పంపే సమయానికి ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిపోయింది. షో నిర్వాహకులు చట్టపరమైన అనుమతులతోనే షో నిర్వహిస్తుండడంతో మధ్యలో నుండి ఆమెను బయటకు తీసుకురావడానికి వీల్లేని పరిస్థితి ఉంది. దీంతో బిగ్ బాస్ ఆమెను రక్షించేసాడంటూ.. చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆమె విచారణ వాయిదా వేశారు. ఆమెను ఎలా బయటకు తీసుకురావడం, నోటీసులు ఎలా అందించాలనే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.