‘మజిలీ’కి హ్యాండిచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌?

అక్కినేని నాగచైతన్య, సమంతలు పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న పిరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా మజిలీ. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీయూనిట్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

సంగీత దర్శకుడు గోపి సుందర్‌ మజిలీ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాటలకు సంబందించిన వర్క్‌ పూర్తి కాగా నేపథ్యం సంగీతం చేయాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి గోపి సుందర్‌ తప్పుకోవటంతో తమన్‌తో బ్యాక్‌ గ్రౌం‍డ్ స్కోర్‌ చేయించే ఆలోచనలో ఉన్నారట మజిలీ టీం. ప్రస్తుతానికి సంగీత దర్శకుడి మార్పుపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఫిలిం నగర్‌లో మాత్రం ఈ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.