ఏపీలో కాంగ్రెస్‌కు మరో షాక్

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖలో తెలిపారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. రేపు తిరుమలలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పాటు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న మనోహర్‌ ఈ
నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కచ్చితంగా షాకే. ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని జనసేన అంచనా వేస్తోంది.

2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పార్టీని వీడినప్పటికీ మనోహర్ మాత్రం ఇప్పటివరకూ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన ఆయన… 2011లో అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో స్పీకర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్‌పై అనేక ఉహాగానాలు వచ్చాయి. ఓ దశలో తెంలగాణ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్ మధ్య ఎప్పటి నుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఇద్దరి రాజకీయ ఆకాంక్షలు కూడా ఒకటే కావడంతో జనసేనతో కలవాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.