పృథ్వికి వార్నింగ్ ఇచ్చిన నాగబాబు..!

ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీలతో బిజీ అయిపోయాడు మెగా బ్రదర్ నాగబాబు. తనకంటూ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మరి ఎవరెవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని స్పెషల్ గా టార్గెట్ చేసి మరి విమర్శిస్తున్నాడు. తాజాగా కమెడియన్ పృథ్వీని టార్గెట్‌ చేస్తూ సెటైర్లు వేశాడు నాగబాబు. అయితే దీనికి ఆజ్యం పోసింది మాత్రం పృథ్వినే. ముందు ఇది అక్కడి నుంచే మొదలైంది. ఆ మధ్య జనసేన పార్టీ కి నాగబాబుతో కలిసి వరుణ్ తేజ్ కోటి 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఈ డబ్బుపై కమెడియన్ పృథ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పన్ను ఎగ్గొట్టడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన డబ్బును తన కొడుకు ఖాతాలో వేసి నాగబాబు జనసేన పార్టీకి విరాళం ఇచ్చాడు అంటూ కాంట్రవర్సీ కామెంట్ చేశాడు.

ఆ నోటా ఈ నోటా పడి చివరికి నాగబాబు వరకు వెళ్లాయి ఈ మాటలు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నాగబాబు దీనికి సమాధానం చెప్పాడు. ఇలాంటి మాటలు అన్నాడు అంటే నమ్మడానికి సాధ్యం కావడం లేదు.. ఒకవేళ ఆయన నిజంగా అని ఉంటే మాత్రం కచ్చితంగా దానికి వ్యక్తిగతంగా వెళ్లి మరి సమాధానం చెప్తాను అంటున్నాడు. పృథ్వీ దగ్గర తన ఫోన్ నెంబర్ ఉందని.. అరేయ్ పృథ్వి నీకేమైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చెయ్ నేనే చెప్తాను అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మెగా బ్రదర్.

అక్కడితో ఆగకుండా తాము జనసేన పార్టీకి ఇచ్చిన విరాళం పన్ను అఫీషియల్‌గా అకౌంట్‌ పరంగా ఇచ్చిందని మరోసారి ధృవీకరించాడు. 1980ల్లోనే చిరంజీవి స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయం నుంచి తమ కుటుంబంపై.. ఆయనపై కొందరు రాళ్లు వేసే కార్యక్రమం మొదలు పెట్టారని.. ఆ రాళ్ళు తీసుకొని ఒక పెద్ద కోటను చిరంజీవి నిర్మించుకున్న సంగతి మర్చిపోవద్దు అంటూ విమర్శించే వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నాడు నాగబాబు. ఏదేమైనా కూడా ఈయన ఇలా రోజుకో వివాదంలో ఇరుక్కుపోతుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుని పోతున్నారు.