‘సవ్యసాచి’ నాగచైతన్య అర్జునుడి గెటప్‌ టీజర్‌

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. ‘మహాభారతం’లో అర్జునుడి మరో పేరు సవ్యసాచి. ఆయన రెండు చేతలతో సమబలాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఈ చిత్రంలో నాగచైతన్యది కూడా అర్జునుడి తరహా పాత్రే. అందుకే సినిమాలో అర్జునుడికి సంబంధించిన ఓ సన్నివేశాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంలో ‘సుభద్ర పరిణయం’ కు సంబంధించిన ఓ కామెడీ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశానికి సంబంధించిన టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. టీజర్లో అర్జునుడి గెటప్‌లో నాగచైతన్య, కృష్ణుడి గెటప్‌లో వెన్నెల కిశోర్‌ నటించారు. కృష్ణుడిని ధర్మరాజు గెటప్‌లో ఉన్న ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ..’కృష్ణా బలరాముడు అంటే రాముడికి చుట్టమా?’ అని అడుగుతాడు. ఇందుకు వెన్నెల కిశోర్‌ వెటకారంగా సమాధానమిస్తూ..’సుదర్శన చక్రం సర్వీసింగ్‌కు ఇచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే నీకుండేదిరా దరిద్రుడా’ అని తిట్టడం నవ్వులు పూయిస్తోంది. ఓ సందర్భానికి ఎలా స్పందించాలనేది ఓ వ్యక్తి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందని.. సవ్యసాచి లాంటి లక్షణాలున్న వారిని చూశాక తన చిత్రంలోని హీరో పాత్రకు ఆ పేరు పెట్టానని దర్శకుడు చందూ ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ఈ సినిమాలో భిన్న భాగాలుంటాయని.. మాధవన్‌ పాత్రకు చైతన్య పాత్రకు మధ్య సంబంధమేంటన్నది ఓ ఉపకథలో వివరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నవీన్‌, రవి, మోహన్‌ చెరుకూరి నిర్మించారు. నవంబర్‌ 2న ‘సవ్యసాచి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.