అరేంజ్డ్‌ మ్యారేజీలో ఫీలింగ్‌ ఎక్కడ అంటున్న నాగచైతన్య

‘లవింగ్‌ ఎక్కడ?.. ఫీలింగ్‌ ఎక్కడ?..’ అంటూ తెగ బాధపడుతున్నారు అక్కినేని నాగచైతన్య. ఈయన హీరోగా నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ఈ సినిమాలో సమంత, దివ్యాంశాకౌశిక్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు‌. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. గోపీ సుందర్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను శుక్రవారం విడుదల చేశారు. దీన్ని చైతన్య సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. ‘మజిలీ’లో నాకు ఇష్టమైన ‘వన్‌ బాయ్‌, వన్‌ గర్ల్‌..’ పాట ఇదిగో.. పెద్దలు కుదిర్చి, చేసిన పెళ్లిపై పూర్ణ (చైతన్య పాత్ర) తన బాధను వ్యక్తపరుస్తున్నాడు’ అని ట్వీట్‌ చేశారు.

‘వన్‌ బాయ్‌ వన్‌ గర్ల్‌ లుకింగు, హైటు‌ వైటు చెకింగు,‌ పేరెంట్స్‌ ఫిక్సింగ్‌‌ మ్యాచింగు‌, డౌరీ గివింగు‌‌.. ఇన్‌సైడ్‌ ఫస్ట్‌లవ్‌ కిల్లింగు.. యుఆర్‌ డైయింగు‌..’ అంటూ సాగిన ఈ పాటను దాదాపు ఆంగ్లపదాలతోనే రచించారు. గాయకుడు రేవంత్‌ పాటను చక్కగా ఆలపించారు. గోపీసుందర్‌ సంగీతం కొత్తగా అనిపించింది. ‘మజిలీ’ చిత్రంలో రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, రాజశ్రీ నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విదేశీ హక్కులు దాదాపు రూ.2.5 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. స్వదేశీ హక్కులకు కూడా మంచి డిమాండ్‌ ఏర్పడినట్లు తెలిసింది.