నాగ్‌ విందులో సందడి చేసిన మంచు లక్ష్మి

టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున, అమల దంపతులు పోర్చుగల్‌లో తమ స్నేహితులు, ‘మన్మథుడు 2’ చిత్ర బృందం కోసం పార్టీ ఏర్పాటు చేశారు. నాగ్, రకుల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమాకి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గత కొన్ని రోజులుగా పోర్చుగల్‌లో జరుగుతోంది. ఇటీవల అక్కడి జిమ్‌లో తీసిన వీడియోను నాగార్జున షేర్‌ చేశారు. కాగా తమ కోసం నాగ్‌ పార్టీ ఏర్పాటు చేశారని వెన్నెల కిశోర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ పార్టీలో మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. నాగ్‌ విందు అందరికీ బాగా నచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా నాగ్‌కు వెన్నెల కిశోర్‌, రకుల్‌, మంచు లక్ష్మి ధన్యవాదాలు చెప్పారు. ‘ఎంత చక్కటి సాయంత్రం.. నవ్వులు, సందడి, మంచి స్నేహితులు, రుచికరమైన ఆహారం, మధురమైన జ్ఞాపకాలతో నిండిపోయింది. మమ్మల్ని ఆహ్వానించినందుకు నాగార్జున, అమలకి ధన్యవాదాలు’ అని రకుల్‌ ట్వీట్‌ చేశారు. ‘పాజిటివ్‌, అద్భుతమైన వ్యక్తులు. నేను విజిటర్‌గా రావడం సంతోషంగా ఉంది’ అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.