జగన్‌ డ్రామా అట్టర్‌ ప్లాప్‌: నక్కా ఆనందబాబు

వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరవవడంతో సానుభూతి కోసం ఆడిన కోడికత్తి డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని ఎద్దేవా చేశారు మంత్రి నక్కా ఆనందబాబు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ పాదయాత్ర 17 రోజుల విరామం, విశ్రాంతి తర్వాత ప్రారంభమయిందన్నారు. అంతకముందు వారానికి ఐదు రోజులు జరిగే పాదయాత్ర కోడికత్తి దెబ్బకు ఆగిపోయిందని విమర్శించారు. విశాఖలో అర సెంటీమీటర్‌ ఉన్న కోడికత్తి గాయం హైదరాబాద్‌ వెళ్లే సరికి 4 అంగుళాలు, 9 కుట్లకు చేరుకుందని చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అంత గాయమైతే బ్లీడింగ్‌ ఎలా ఆగిందని, విమానంలోకి ఆయనను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. హైకోర్టు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తిందని నక్కా గుర్తు చేశారు.