నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నమ్రత: మహేష్‌బాబు

టాలీవుడ్‌ హీరో మహేష్‌బాబుకు ఎంత స్టార్‌డమ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన సతీమణి నమ్రత అని మహేష్‌ అన్నారు. ఆయన నటించిన ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మహేష్‌ ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కుటుంబం గురించి మాట్లాడారు. ‘మీ విజయంలో నమ్రతకు ఎంత క్రెడిట్‌ ఇస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘నమ్రత నా బలం, నా వెన్నెముక, నా జీవితం, నా సక్సెస్‌, నా సంతోషం. ఓ విధంగా నేను సాధించినవన్నీ నమ్రత, పిల్లల కోసమే. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నమ్రత. నా పిల్లలకు ఇష్టమైన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. వారి తల్లిదండ్రులు నటీనటులు కాబట్టి నటనను ఎంచుకోమని బలవంత పెట్టడం సరికాదు’ అని అన్నారు.

అనంతరం ’43 ఏళ్ల వయసులోనూ ఇంత అందంగా ఉన్నారు?’ అని అడగగా.. ‘ధన్యవాదాలు.. నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. ముఖ్యం నేను తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటాను. నాకు చీట్‌ డేస్‌ (ప్రత్యేక సందర్భాల్లో ఇష్టం వచ్చిన ఆహారం తినడం) ఉండవు. నా సంతోషాన్ని నా కుటుంబంలో వెతుక్కుంటాను’ అని మహేశ్‌ పేర్కొన్నారు.

‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. ఈ సినిమా ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది.

 

CLICK HERE!! For the aha Latest Updates