జగన్‌ అధికారం కోసం కత్తి డ్రామా.. లోకేశ్‌ ట్వీట్‌

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్‌ హైదరాబాద్‌ చేరుకుని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరారు. జగన్‌కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. జగన్‌ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగు పడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని.. జగన్‌కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పారు.

తాజాగా జగన్‌పై దాడి గురించి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని పేర్కొన్నారు. ‘వైసీపీ కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోహాన్‌ రెడ్డి’కి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైసీపీ కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే’ అంటూ #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఏపీ మంత్రి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.