ఉగ్రవాదం కొత్త రూపును సంతరించుకుంటుంది: నేవీ చీఫ్ అడ్మిరల్

జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి.. భారత్‌ను అస్థిరపరిచేందుకు చేసిన కుట్రగా నావికాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌ మరింత తీవ్రమైన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగా సముద్ర మార్గాల ద్వారా కూడా దాడి చేసే విధంగా ఉగ్రవాదులకు శిక్షణనిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు.

గతంలో ముంబైలో 26/11 దాడులు జరిపిన ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దిల్లీలో మంగళవారం జరిగిన ఇండో-పసిఫిక్‌ ప్రాంతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అనేక రకాల ఉగ్రదాడులను చూశామని సునీల్ లాంబా తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలోని దేశాలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయన్నారు. రోజురోజుకు ఉగ్రవాదం కొత్త రూపును సంతరించుకుంటుందన్నారు. దీంతో ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరముందన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కొన్ని రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.