న్యూక్లియాతో పనిచేయడం ఆనందంగా ఉంది: శృతి హాసన్

శృతి హాసన్ కేవలం నటిగానే కాకుండా గాయనిగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. ఓ ప్రత్యేక పాట రికార్డింగ్‌ కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ న్యూక్లియాతో కలిసి ఆమె పనిచేయబోతున్నారు. నవంబరులో ఈ పాట‌ విడుదల కాబోతోందట. దీన్ని న్యూక్లియా కొత్త ఆల్బమ్‌లో చేర్చబోతున్నారు.

ఈ సందర్భంగా శృతి ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ బృందంతో కలిసి పనిచేయడం ఉత్సుకతగా ఉంది. మా ట్రాక్‌ (పాట) క్రియేటివిటీతో నిండి ఉంటుందని భావిస్తున్నా. న్యూక్లియాతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయన పనికి నేనెప్పుడూ అభిమానినే. ప్రజల్ని ఆయన మెప్పించిన తీరు నిజంగా అద్భుతం. ఇది నాకు మధురజ్ఞాపకం కాబోతోంది’ అని శృతి అన్నారు. ‘శృతి తన నైపుణ్యంతో నన్ను ఆశ్చర్యపరిచారు. గాయనిగా, రచయిత్రిగా రాణిస్తున్నారు. ఈ ట్రాక్‌ లిరిక్స్‌ను ఆమే రాశారు. ఇది గొప్పగా ఉండబోతోంది’ అని న్యూక్లియా అన్నారు.

శృతి తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమాలో చివరిగా వెండితెరపై కనిపించారు. ప్రస్తుతం ఆమె ‘శభాష్‌ నాయుడు’ చిత్రంలో నటిస్తున్నారు. కమల్‌హాసన్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని కూడా కమలే చూసుకుంటున్నారు. తెలుగు, తమిళంతోపాటు హిందీనూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.