‘మహర్షి’ తరువాతే వస్తానంటున్న నిఖిల్‌

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘అర్జున్‌ సురవరం’ సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టైటిల్‌ విషయంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం అర్జున్‌ సురవరం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌తో పాటు సినిమా విడుదలను కూడా వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటం, అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ కూడా భారీ వసూళ్లు సాధిస్తుందన్న టాక్ వినిపిస్తుండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.

ఈ విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్ అధికారికంగా వెల్లడించారు. మహర్షి రిలీజ్‌ తరువాత అర్జున్‌ సురవరం విడుదల అవుతుందని తెలిపారు. నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ సూపర్‌ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు.