HomeTelugu Big Storiesచేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి: కేసీఆర్

చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి: కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్ సిరిసిల్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాయకుల పాలనపై దుమ్మెత్తిపోశారు. తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని ఏపీ నాయకులు భయపెట్టారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పసిగుడ్డు తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుందని అన్నారు. వచ్చిన తెలంగాణ సంతోషంతో నా కడుపు నింపింది, నేను ఏది జరగాలని కోరుకున్నానో అది బ్రహ్మాండంగా జరుగుతోందని కేసీఆర్ తెలిపారు. 24 గంటల విద్యుత్ అద్భుతంగా అందించగలుగుతున్నామని అన్నారు.

10 10

తెలంగాణలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి, కనీసం వారి జీవితాలకు ఒక భరోసా వచ్చింది, భవిష్యత్తుమీద ఆశకలిగింది అని అన్నారు. అలాగే తెలంగాణలో రైతన్నలు కొంత కుదుటపడ్డారని, రైతుల కోసం రైతుబంధు పథకం తెచ్చామని కేసీఆర్ అన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఇస్తామని అన్నారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ. 5 లక్షల బీమా అందిస్తామని కేసీఆర్ తెలిపారు. చిన్న ఉద్యోగులు అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వీళ్లందరికీ అతి ఎక్కువ జీతాలిచ్చే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని కేసీఆర్ అన్నారు.

ప్రతి సంవత్సరం తెలంగాణకు 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల అదనపు రాబడి వస్తోందని కేసీఆర్ తెలిపారు. ఆ సంపదను పేదలకు పంచుతున్నామని అన్నారు. పెరిగిన సంపదను కుంభకోణాలు, లంబకోణాలు చేయలేదని పేదలకు పంచుతున్నామని కేసీఆర్ తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేదలకు రూ. లక్షా 116 ఇస్తున్నామని తెలిపారు. ఆసరా పెన్షన్లు వెయ్యి నుంచి 2,016కి పెంచుతున్నామని పేదల బతుకులకు భరోసా కల్పిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే వికలాంగులకు 1500 నుంచి రూ.3,016 అందిస్తామని అన్నారు. లక్షలాది నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. ప్రతి చేనేత కార్మికుడికి 25 నుంచి 35 వేల జీతం వచ్చే పరిస్థితి రావాలని కేసీఆర్ అన్నారు. ప్రతి చేనేత కుటుంబంలోని మహిళలు అపెరల్ పార్క్‌లో వారే దానికి యజమానులు కావాలి అన్నారు. రెడీమేడ్ దుస్తులు అమెరికా
మార్కెట్లో అమ్మే సిరిసిల్ల తయారు కావాలి అదే నా కల అని కేసీఆర్ తెలిపారు. వేములవాడను అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని, కేసీఆర్ లేకపోతే జన్మలో రాజన్నసిరిసిల్ల జిల్లా అయ్యేది కాదు అని తెలిపారు.

నాలుగేళ్లలో రాష్ట్ర ఆర్థిక పెరుగుదల 17.17 శాతం ఉందని కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాది కూడా ఆర్థిక వృద్ధి 17.83తో ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ అన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ సంపద పెరుగుతుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సంపద పెంచడమంటే తానా తందానా చెప్పడం కాదని, కథలు చెబితే పెరగదని ఎద్దేవా చేశారు. కడుపు కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, అవినీతితో లంచాలు తీసుకోవద్దు, అవినీతికి పాల్పడొద్దు అప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ రాకముందు ఇక్కడ పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది. ఇప్పుడు అడ్డు పొడుగు ఎవరెవరు మాట్లాడుతున్నారో, ఇష్టమొచ్చినట్టు అవాకులు, చవాకులు పేలుతున్నారో వాళ్లే రాజ్యం చేశారు. అప్పట్లో పదేళ్లలో ఇసుకపై రూ. 9 కోట్ల 56 లక్షలు ఆదాయం వస్తే.. ఇప్పుడు నాలుగేళ్లలో 2,057 కోట్ల రూపాయలు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నేనేమైనా మాయా మశ్చింద్ర చేశానా అన్నారు. దొంగతనం అరికట్టాం అంతే ఆదాయం పెరిగిందని అన్నారు. ఇసుక విచ్చలవిడి స్మగ్లింగ్ అరికట్టాం అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఆదాయం పెరుగుతుందని కేసీఆర్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu