అభిమాని మృతిపై సంతాపం తెలిపిన ఎన్టీఆర్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ తన అభిమాని, ఆప్త మిత్రుడయిన జయదేవ్‌ చనిపోయారన్న వార్త తెలిసి మనస్తాపానికి గురయ్యానని అంటున్నారు. కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి అయిన జయదేవ్‌ సోమవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తారక్‌ ఆయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘నాకు అత్యంత ఆప్తుడయిన జయదేవ్‌ ఇక లేరన్న వార్త తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు. ఓ నటుడిగా నా కష్టసుఖాల్లో అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు తోడుగా ఉన్నవారిలో జయదేవ్‌ చాలా ముఖ్యమైన వ్యక్తి. జయదేవ్‌ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. జయదేవ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.