ఆంధ్రప్రదేశ్‌పై ఆపరేషన్‌ గరుడ దాడికి సిద్ధమైంది: శివాజీ

ఆంధ్రప్రదేశ్‌పై ఆపరేషన్‌ గరుడ మరో రూపం దాల్చుకుని దాడికి సిద్ధమైందని హీరో శివాజీ అన్నారు. శనివారం శివాజీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఒక ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం భావితరాలను ఇబ్బంది పెట్టడమే. నిన్న అర్ధరాత్రి నాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. జాతీయస్థాయిలోని రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం చంద్రబాబుకు నోటీసులు వస్తాయి. ఇది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఈ స్థానంలో జగన్‌ ఉన్నా, నా ఆందోళన ఇలాగే వ్యక్తం చేస్తా. చంద్రబాబును తొలగించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విప్పింది.

ప్రజలను పక్కన పెట్టి, మీరు స్వార్థ రాజకీయ క్రీడను ఆడుతున్నారు. ఇదా! ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి? ఇంత దుర్మార్గం అవసరమా? భావి తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వాళ్ల భవిష్యత్‌ ఏంటి? బీజేపీ నేతలు పొలిటికల్‌ టెర్రరిస్టులుగా మారుతున్నారు విమర్శించారు. తనకు రాజకీయ పార్టీల నుంచి ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా శివాజీ చెప్పారు. వరవరరావు వంటి వ్యక్తులపై ఆరోపణలు చేయడం సరికాదని.. ఇది కేవలం పబ్లిసిటీ స్టంటేనని అన్నారు. రాజకీయంగా అడ్డు తొలగించుకునే కుట్ర ఇది. హోదా లేకుండా ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట తప్పి భారతీయ బీజేపీ పార్టీని రాష్ట్రంలో చంపేశారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి ఏం సాధిస్తారు?’ అని శివాజీ ప్రశ్నించారు.