‘మహర్షి’ కొత్త పాట ఆకట్టుకుంటుంది

‘పదరా పదరా పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా..’ అంటోంది ‘మహర్షి’ చిత్ర బృందం. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన సినిమా ఇది. ఈ చిత్రంలోని కొత్త పాటను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. రైతుల నేపథ్యంలో సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. మహేశ్‌ దుక్కిదున్నుతూ, వరినాట్లు వేస్తూ కనిపించారు. ‘భళ్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోన.. ఎదలో రోదనకు వరమల్లే దొరికిన ఆశల సాయం నువ్వేరా..’ అని సాగిన ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

‘మహర్షి’ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.