భారత్‌ సినిమాలను నిషేంధించిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ తమ దేశంలో భారత్‌ సినిమాల విడుదలను నిషేధించింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన సోమవారం పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరంపై బాంబుల వర్షం కురిపించడంతో జైషే అధినేత మసూద్‌ అజార్‌ బావమరిది సహా 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో భారత్‌ సినిమాల్ని నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్‌ సమాచార మంత్రి ఫవాద్‌ చౌదరి ప్రకటించారు. మేడిన్‌ ఇండియా ప్రకటనల్ని కూడా నిషేధించాలని పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎమ్‌ఆర్‌ఏ)కి సూచించారు. ‘భారత కంటెంట్‌ను సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ బహిష్కరించింది. ఇక పాకిస్థాన్‌లో భారత్‌ సినిమాలు విడుదల కావు. మేడిన్‌ ఇండియా ప్రకటనలకు వ్యతిరేకంగా పీఈఎమ్‌ఆర్‌ఏ వ్యవహరించాలని సూచించాం’ అని ఫవాద్‌ ట్వీట్‌ చేశారు.

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్థాన్‌ కళాకారులతో కలిసి పనిచేయకూడదని భారత చిత్ర పరిశ్రమ ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన విడుదల చేసింది. దీన్ని ఉల్లంఘించిన సంస్థను నిషేధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.