పొలిటికల్‌ థ్రిల్లర్‌గా త్రిష 60వ సినిమా ‘పరమపదం విలయట్టు’.. ట్రైలర్‌

ప్రముఖ నటి త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పరమపదం విలయట్టు’. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. త్రిష ఓ దివ్యాంగురాలి తల్లిగా, వైద్యురాలి పాత్రలో కనిపించారు. ఓ రాజకీయ నాయకుడి వల్ల ఆమె సమస్యల్లో పడతారు. ‘ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను బ్లాక్‌ చేయండి’ అని రాజకీయ నేత అడగగా.. ‘నీ ఆదేశాలు పాటించేందుకు.. నేను నీ పార్టీ కార్యకర్తను కాను’ అని త్రిష సమాధానం చెప్పే తీరు ఆకట్టుకుంది. అతడ్ని ఎదిరించడం వల్ల ఆమెకు, ఆమె కుమార్తెకు అపాయం తలపెట్టాలని చూస్తుంటారు. ‘నా కూతురు ఎక్కడ?’ అని రక్తమోడుతున్న త్రిష రౌడీల్ని ప్రశ్నిస్తూ కనిపించారు. కొన్ని షాట్స్‌లో ఆమె స్టంట్స్‌ కూడా చేశారు.

కె.తిరుగననమ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 24 HRS ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అమ్రిష్‌ బాణీలు అందించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది త్రిష 60వ సినిమా కావడం విశేషం.