Homeతెలుగు Newsఓపిక లేని నాయకులు వల్లే పీఆర్పీ చేజారిపోయింది: పవన్‌

ఓపిక లేని నాయకులు వల్లే పీఆర్పీ చేజారిపోయింది: పవన్‌

5 4
ఈ రోజు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈవ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాత్రికి రాత్రి ఎవరూ ఎదగలేరని, పాతికేళ్లు ఓపిక పట్టాలని అన్నారు. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాలని ప్రేరణ కలిగించిన వారిలో, ఆ పార్టీ ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో తానూ ఒకడినని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగేదని, ఓపిక లేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల ఆ అవకాశం చేజారిపోయింది అన్నారు. ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారని, అందువల్లే తాను జనసేన పార్టీ నిర్మాణంలో ఆచితూచి ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ప‌రిస్థితులు ప్రతికూలంగా ఉన్న స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీని స్థాపించానని వివరించారు.

సినిమాల్లోకి రాక ముందు నుంచే తాను సమాజాన్ని క్షుణ్నంగా అర్థం చేసుకోవడం ప్రారంభించానని పవన్‌ తెలిపారు. యూనివర్సిటీల నుంచి ప‌ట్టాలు తీసుకోక‌పోయినా, రాజకీయ శాస్త్రం, ప్రభుత్వ విధానాలు, దేశంలో కులాలు- వాటి ప్రభావం, అంబేద్కరిజం వంటి వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నానని వివరించారు. జనసేన పార్టీ పెట్టిన‌ప్పుడు పెద్ద నాయ‌కులు ఎవ‌రూ లేరని, యువ‌త‌ను న‌మ్మి పార్టీ పెట్టాన్నారు. వారే జనసేనకు వెన్నెముక‌గా పవన్‌ అభివర్ణించారు. దీర్ఘకాలిక ప్రయోజ‌నం కోసం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. రాజ‌కీయాలు సంపూర్ణంగా వ్యాపారం అయిపోయాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు తదితర ప్రజా సమస్యలను పరిష్కరించే ఓపిక కూడా నేతల్లో కనిపించటం లేదన్నారు.

ప్రస్తుతం ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే రూ.2 వేల కోట్లు అవ‌సరమని చాలామంది తనతో అంటున్నారని, ఇప్పుడున్న రాజ‌కీయ ప‌క్షాలు అందుకు సన్నద్ధంగా ఉన్నాయని చెబుతున్నారని పవన్‌ నేతలతో అన్నారు. అలాంటి పార్టీల‌తో మీరెలా పోటీ ప‌డగలరని తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అందుకే, రాజకీయాలు న‌డ‌ప‌డానికి డ‌బ్బు అవ‌స‌రం లేద‌ని రుజువు చేసిన కాన్షీరాంను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తానన్నారు. తనకు సినిమాల్లో న‌టన ఎప్పుడూ సంపూర్ణంగా సంతృప్తి ఇవ్వలేదన్న పవన్‌.. ప్రజా స‌మ‌స్యలు ప‌రిష్కరించిన‌ప్పుడే సంపూర్ణ ఆనందం క‌లిగిందన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 60 శాతం మంది కొత్త వ్యక్తుల్ని బ‌రిలో నిలుపుతానని, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దీన్ని తు.చ. త‌ప్పకుండా అమలు చేస్తానని స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu