‘సైరా’ టీజర్‌కు పవన్‌ వాయిస్‌ ‌?

ప్రముఖ నటుడు చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ సందడి చేయబోతున్నారట. అదెలా అనుకుంటున్నారా?.. ఆగస్టు 22న మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త టీజర్‌ను విడుదల చేయాలని యూనిట్‌ భావిస్తోందట. ఈ టీజర్‌కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభిమానులకు చిరు బర్త్‌డే కానుకగా రాబోతున్న ఈ టీజర్‌ ఆకట్టుకోబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు చిరు, పవన్‌ కలిసి దిగిన ఫొటోలంటూ కొన్ని చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ‘సైరా’ మేకింగ్‌ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అత్యున్నత ప్రమాణాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు మేకింగ్‌ వీడియో చూస్తే అర్థమవుతోంది. అక్టోబరు 2న ఈ సినిమా విడుదల కానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది.