HomeTelugu Reviewsపిండం మూవీ రివ్యూ

పిండం మూవీ రివ్యూ

pindam

టాలీవుడ్‌ నటుడు శ్రీరామ్ ప్రధానలో నటించిన తాజా చిత్రం పిండం. ఈ సినిమాకి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా నేడు థియేటర్స్ విడుదలైంది. ఈ హారర్ థ్రిల్లర్ ఏ రేంజ్ లో భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 1990లలో నడుస్తూ ఉంటుంది. ఆంథోని (శ్రీరామ్) ఫ్యామిలీ ‘శుక్లా పేట్’లో ఒక ఇంటిని కొనుగోలు చేస్తారు. కాస్త ఊరికి దూరంగా ఆ బంగ్లా ఉంటుంది. భార్య మేరీ (ఖుషీ రవి) కూతుళ్లు సోఫీ – తార (బేబీ చైత్ర) , తల్లి సూరమ్మ (విజయలక్ష్మి)తో కలిసి అతను ఆ ఇంట్లో దిగుతాడు. ఆ ఊళ్లోని ఒక మిల్లులో క్లర్క్ గా చేరతాడు. ఒక వైపున మిల్లు పనులు చూసుకుంటూనే, మరో వైపున ఇంటికి మరమ్మత్తులు చేయిస్తూ ఉంటాడు. మేరీ మరోసారి గర్భవతిగా ఉంటుంది. ఆ ఇంట్లోకి దిగిన రోజు రాత్రి నుంచే సమస్య మొదలవుతుంది.

పదేళ్ల సోఫీ స్కూల్ కి వెళ్లి వస్తుంటుంది. ఆరేళ్ల ‘తార’కి పుట్టుకతోనే మాటలు రావు. అలాంటి తార రాత్రివేళలో ఏవో మంత్రాలను పఠిస్తూ ఉంటుంది. ఈ విషయం సోఫీ ద్వారా తెలుసుకుని ఆంథోని దంపతులు కంగారు పడతారు. ఆ తరువాత తనకి చీకట్లో దారిచూపించిన వ్యక్తి, హఠాత్తుగా అదృశ్యం కావడం, ఆంథోనికి అనుమానాన్ని కలిగిస్తుంది. ఇక మరో గదిలో నుంచి ఎవరో ఏడుస్తూ ఉండటం సూరమ్మ వింటుంది. అందరూ కూడా ఆ ఇంట్లో ఏవో దుష్ట శక్తులు ఉన్నాయనే నిర్ణయానికి వస్తారు.

దాంతో ఇక ఆ ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలోనే దుష్టశక్తులను తరిమికొట్టే ‘అన్నమ్మ’ (ఈశ్వరీ రావు) గురించి వాళ్లకి తెలుస్తుంది. దాంతో వాళ్లు ఆమెను ఫోన్లో సంప్రదిస్తారు. ప్రస్తుతం తాను వేరే చోట ఉన్నాననీ, తాను రావడానికి కొంత సమయం పడుతుందని ‘అన్నమ్మ’ చెబుతుంది. ఆ కుటుంబం ఆపదలో ఉందనీ, కొన్ని దుష్టశక్తులు వాళ్లపై కోపంతో ఉన్నాయని ఆమె అంటుంది. అయితే ఆ ఇంటిని ఖాళీ చేసే ఆలోచన చేయవద్దనీ, ఆ విషయం ఆ దుష్టశక్తులకి తెలిస్తే మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తుంది.

‘అన్నమ్మ’ వచ్చేలోగా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? అప్పుడు ఆంథోని కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? ఆ ఇంట్లో ప్రేతాత్మలు ఎందుకు ఉన్నాయి? గతంలో ఆ ఇంట్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఆంథోని కుటుంబ సభ్యులను ప్రేతాత్మలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? ‘అన్నమ్మ’ తనకి గల తాంత్రిక శక్తితో ఆ ప్రేతాత్మలను తరిమికొట్టగలుగుతుందా? అనే సందేహాలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

దర్శకుడు సాయికిరణ్ దైదా ఈ కథను తయారు చేసుకున్నాడు. ఒక ఫ్యామిలీ కొత్తగా ఒక ఇంటిని కొనుగోలు చేసి అందులోకి రావడం .. లేదంటే కొత్తగా అద్దెకి దిగడం .. గతంలో అక్కడ జరిగిన సంఘటనల కారణంగా అక్కడ ప్రేతాత్మలు ఉండటం .. వాళ్లను నానా ఇబ్బందులకు గురిచేయడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. ఒక బంగ్లా పరిథిలో .. తక్కువ పాత్రలతో నడిచే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఇంతకుముందు చాలానే చూస్తూ వచ్చారు .. అలాంటి కథనే ఇది.

పాత కథల మాదిరిగానే ఈ సినిమా ఉంటే ఇక చూడటం ఎందుకు? అనే సందేహం రావడం సహజం. ఇక్కడ ఒంటరి బంగ్లా .. అందులో ఒక ఫ్యామిలీ .. ఆ ఇంట్లో ప్రేతాత్మలు . వాటి బారి నుంచి బయట పడటానికి వాళ్లు చేసే ప్రయత్నాలు .. అవన్నీ కూడా కామన్ గానే కనిపిస్తాయి. అయితే దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా మోడ్రన్ మాంత్రికురాలిగా ఈశ్వరీరావు పాత్రను అతను డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది.

ఈ సినిమా మొత్తంలో ఈశ్వరీరావు నటన .. ‘తార’ పాత్రనుపోషించిన బేబీ చైత్ర నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాలి. మిగతా వాళ్లంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. తాంత్రిక శక్తులపై పరిశోధన చేసే లోక్ నాథ్ పాత్రలో అవసరాల కనిపించాడుగానీ, ఆ పాత్రకి ప్రాధాన్యత లేదు. సతీశ్ మనోహరన్ ఫొటోగ్రఫీ .. కృష్ణ సౌరభ్ నేపథ్య సంగీతం ఈ సినిమాను కొంతవరకూ నిలబెట్టాయి. శిరీశ్ ప్రసాద్ ఎడిటింగ్ ఫరవాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu