HomeTelugu Newsఏడాది పాలనపై దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ

ఏడాది పాలనపై దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ

15 3
కేంద్రంలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ అఖండ మెజారిటీ సాధించి అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. ఏడాది క్రితం ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైందని అన్నారు. దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో తమకు అధికారం కట్టబెట్టారన్నారు. దేశాన్ని
ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే దేశ ప్రజల కల అని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, సాధించిన విజయాలను గుర్తుచేశారు. దేశంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించామన్నారు. ‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్’ నినాదం ఇచ్చిన ఉత్సాహంతో దేశం అన్ని రంగాల్లో ముందడుగువేస్తోందన్నారు. ఎన్డీయే పాలనలో కోట్లాది మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందచేశామన్నారు. అయోధ్య రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు శతాబ్దాల కాలంగా సాగుతున్న చర్చకు మంచి ముగింపునిచ్చిందని చెప్పారు.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం దేశ సమగ్రతను చాటిందన్నారు. ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేశామని, పౌరసత్వ చట్టానికి సవరణ చేయడంతో దేశ దయాగుణం, సమ్మిళిత తత్వం తెలియచేస్తుందని అన్నారు. త్రివిధ దళాల అధిపతి కోసం కొత్త పదవిని సృష్టించామని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే అనేక చట్టాలు రూపొందించామన్నారు. దేశంలో 50 కోట్ల గోవులకు ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందరు రైతులకు వర్తింపచేసినట్లు వెల్లడించారు. జల్‌ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్ల కుటుంబాలకు తాగునీరందిస్తామన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగంలోని వారికి నెలకు రూ.3 వేల చొప్పున పింఛను ఇవ్వబోతున్నట్టు తెలిపారు. వ్యాపారి కల్యాణ్ బోర్డు ద్వారా వ్యాపారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. 7 కోట్ల మంది స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రుణాలు ఇస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu