పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిని అయ్యాను: పోసాని

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఆయన ఇటీవల చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే చికిత్స తర్వాత పోసాని మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్ని పోసాని ఖండించారు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగుందని, త్వరలోనే షూటింగ్‌కు కూడా హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

‘నా ఆరోగ్యం బాగోలేదని, విషమంగా ఉందని సోషల్‌మీడియాలో రాసినట్లు నా స్నేహితులు చెప్పారు. నిజమే.. నా ఆరోగ్యం బాగోలేదు, కానీ చచ్చిపోయేంత కాదు. వైద్యులు చికిత్స చేసి నన్ను బతికించారు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిని చేశారు. కాబట్టి ఇక నా ఆరోగ్యం గురించి మీకు ఎలాంటి ఆలోచనలు వద్దు. మళ్లీ షూటింగ్‌కు వెళ్లబోతున్నా. త్వరలోనే మీకు తెరపై కనిపించబోతున్నా. నా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న వారికి ధన్యవాదాలు’ అని పోసాని చెప్పారు.