హాట్ టాపిక్‌గా మారిన ప్రజావేదిక కూల్చివేత ఘటన

అమరావతిలోని ప్రజావేదిక భవనం కూల్చివేత ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ముగిసిన రోజు రాత్రే ప్రజావేదిక కూల్చివేత పనులు చేపట్టడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. ఈచర్య ద్వారా సీఎం జగన్‌ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని నిలదీశారు. మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ ప్రజావేదిక నుంచే ప్రారంభమవుతుందని సీఎం జగన్‌ చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నాయకులు పలు విమర్శలు చేశారు.

ప్రభుత్వ భవనాలను పడగొట్టి పైశాచికానందం పొందుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలీసు కేసులకు భయపడేది లేదని, ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌నెం.2లో అక్రమంగా నిర్మించిన ఇంట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం నివసిస్తుంటే.. చంద్రబాబు వదిలేశారని, అదీ ఆయన విజ్ఞత అని గుర్తు చేశారు. ఆతరువాత ఆ ఇంటిని రెగ్యులరైజ్‌ చేయించుకున్నారని వెల్లడించారు.

ఓర్వలేని తనంతోనే ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్ష పూరిత చర్యలతో వెళ్తోందని ఆరోపించారు. అందుకు ప్రజావేదిక కూల్చడం ఒక నిదర్శమని అన్నారు. ప్రజావేదికపై ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయం చేయడం సరికాదని, ఇలాంటి చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రాత్రికి రాత్రి ప్రజావేదికను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీ సీనియర్‌ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎక్కడా వసతి లేదు కాబట్టి.. కొత్త భవనాన్ని నిర్మించే వరకూ ప్రజావేదికను వాడుకోవచ్చని స్పష్టం చేశారు.

ప్రజావేదిక కూల్చివేత ప్రభుత్వ విధానాలకు అద్దంపడుతోందని.. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సి వస్తుందనే ప్రజావేదికను కూల్చివేత అని టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆరోపించారు.