మీటూపై ‘ప్రీతి జింటా’ సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు

మీ నుంచి ఇలాంటి సమాధానాలు ఊహించలేదంటూ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ హంగామా సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన ప్రీతి ఇంటర్వ్యూనే ఇందుకు కారణం. ఇంతకీ విషయమేమిటంటే… నవంబరు 16న రికార్డు చేసిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రీతి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం భారతదేశాన్ని కుదిపేస్తున్న మీటూ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. మీకూ అలాంటి అనుభవం ఎదురైందా అని ఆమెను ప్రశ్నించగా.. ‘లేదు.. ఒకవేళ ఉన్నా బాగుండేది. మీ ప్రశ్నకు జవాబు దొరికి ఉండేది’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

అంతేకాకుండా ‘మనం ఎలా ఉండాలని కోరుకుంటామో.. ఎదుటి వ్యక్తి మనల్ని చూసే విధానం కూడా అలాగే ఉంటుంది. నాకైతే ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవలేదు. మహిళలకు బాలీవుడ్‌ ఇండస్ట్రీ చాలా శ్రేయస్కరం. కొంతమంది పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడేస్తున్నారు’ అని ప్రీతి చెప్పుకొచ్చారు.

దీంతో మరి నెస్‌వాడియా సంగతేంటి. అప్పుడు మీరు ఎందుకు అతడిపై కేసు పెట్టారు.. ఒక మహిళ అయి ఉండి మహిళల గురించి అలా ఎలా మాట్లాడతారు.. మొదట రాఖీ సావంత్‌.. ఇప్పుడు మీరు.. అసలు ఊహించలేదు’ అంటూ ప్రీతిని సోషల్చే మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురుస్తుండటంతో ప్రీతి దిద్దుబాటు చర్యలకు దిగారు. తన ఇంటర్వ్యూను ఎడిట్‌ చేసి, వాళ్లకు కావాల్సిన విధంగా మలుచుకున్నారంటూ తనను ప్రశ్నించిన జర్నలిస్టుపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అయితే ప్రీతి ఆరోపణలపై సదరు జర్నలిస్టు ఇంతవరకు స్పందించలేదు.

కాగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ‘కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌’ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా 2014లో ఓ మ్యాచ్‌ సందర్భంగా వ్యాపారవేత్త నెస్‌వాడియా తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేశారు. అయితే ప్రీతి ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల తర్వాత అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసులు నెస్‌వాడియాపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. గత నెలలో నెస్‌ వాడియాపై వేధింపుల కేసు కొట్టి వేస్తున్నట్లు బాంబే హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.