Homeతెలుగు Newsరఫేల్‌ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రాహుల్‌

రఫేల్‌ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రాహుల్‌

9 1కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రఫేల్‌ వ్యవహారంపై పార్లమెంటులో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఫేల్‌పై సమాధానం ఇచ్చేందుకు ప్రధాని మోడీకి ధైర్యం లేదని, అందుకే ఆయన తన గదిలో ఉండిపోయారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ‘పార్లమెంటుకు వచ్చి రఫేల్‌పై సమాధానం చెప్పేందుకు ప్రధాన మంత్రికి ధైర్యం చాలడం లేదు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా సభలో అన్నా డీఎంకే ఎంపీల వెనుక దాక్కున్నారు. రఫేల్‌ ఒప్పందంలో చాలా లొసుగులు ఉన్నాయి. గతసారి నేను ఈ అంశం లేవనెత్తినప్పుడు కూడా ప్రధాని ఐదు నిమిషాలే స్పందించారు.’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. రఫేల్‌ జెట్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ బెడ్‌ రూంలో ఉన్నాయన్న గోవా మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులను సభలో వినిపించాలని రాహుల్‌ పట్టుబట్టారు. ఆడియో టేపులు ఉన్నట్లు మీరు నమ్ముతున్నారా..? అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ రాహుల్‌ను ప్రశ్నించారు. మరోవైపు అరుణ్‌ జైట్లీ సైతం ఆడియో టేపులు నిజమని నిరూపించగలరా? అని సవాలు విసిరారు. ఈ క్రమంలోనే కొంత సేపు సభలో వాడి వేడిగా చర్చ జరిగింది.

సభ తొలుత 2.30కు వాయిదా పడింది. అనంతరం సభ పునఃప్రారంభమయ్యాక రఫేల్‌ అంశంపై రాహుల్‌ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)వేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు కూడా రఫేల్‌ విచారణ వ్యవహారం తమ పరిధిలోకి రాదని చెప్పింది కానీ, జేపీసీ ఏర్పాటు చేయకూడదని ఎక్కడా అనలేదని రాహుల్‌ గుర్తు చేశారు.

తనపై వ్యక్తిగతంగా చిన్న ఆరోపణ కూడా లేదన్న మోడీ వ్యాఖ్యను రాహుల్‌ తప్పుపట్టారు. మంగళవారం ఓ వార్తా సంస్థకు మోడీ ఇచ్చిన ముఖాముఖిలో కూడా రఫేల్‌ ఒప్పందం గురించి అడిగిన ప్రశ్నలకు మోడీ ఎక్కడా సమాధానం చెప్పలేదని రాహుల్‌ ఆక్షేపించారు. ఒప్పందంలో భాగంగా ఒక్కో విమానానికి రూ.1,600 కోట్ల ధరను వెచ్చించడానికి రక్షణ శాఖ ఉన్నతాధికారులు సైతం అభ్యంతరం తెలిపారని అన్నారు. కేవలం తన ‘ప్రియ స్నేహితుడు’ అయిన అనిల్‌ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే మోడీ ఒప్పందంలో మార్పులు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన గందరగోళంతో సభ 3.30 కు వాయిదా పడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu