విశాల్‌పై రాధిక ఫైర్‌

తమిళ స్టార్‌ హీరో విశాల్‌కు ప్రముఖ నటి రాధిక చురకలు అంటించారు. 2019-2022 ఏడాదికి గానూ ఈ నెల 23న నడిగర్‌సంఘం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవర్‌ జట్టు, కే.భాగ్యరాజ్‌ స్వామి శంకరదాస్‌ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. విశాల్‌ ఇటీవల శరత్‌ కుమార్‌, రాధారవి న్యాయకత్వాన్ని విమర్శిస్తూ ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. దీనిపై ఇప్పటికే శరత్‌ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్‌ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

కాగా ఇప్పుడు శరత్‌ కుమార్‌ సతీమణి రాధిక ట్విటర్‌ వేదికగా విశాల్‌ను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్‌ చేశారు. విశాల్‌ తన భర్తపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణల్ని నిరూపించుకోగలరా?అని ప్రశ్నించారు. విశాల్‌ను చాలా మంది విమర్శించారని.. ఈ కోణంలో ఇప్పుడు శరత్‌ కుమార్‌ను తప్పుపట్టేందుకు ఆయన అర్హుడు కాదని అన్నారు. విశాల్‌ తరచూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. పాండవర్‌ జట్టు 2015 ఎన్నికల్లో పాడిన పాటనే ఎప్పుడు కూడా పాడుతోందని పేర్కొన్నారు. నడిగర్‌ సంఘంలో తనకు తెలియకుండానే అన్నీ కార్యకలాపాలు జరుగుతుంటాయని అధ్యక్షుడు నాజర్‌ చాలా సార్లు అన్నారని తెలిపారు. ఇలాంటి స్వార్థపూరితమైన పనులు నడిగర్‌ సంఘానికి, ఆర్టిస్టులకు మంచిది కాదని రాధిక అభిప్రాయపడ్డారు.