రాజ్ తరుణ్ కు రీప్లేస్మెంట్ హీరో!

ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటుడు రాజ్ తరుణ్. ఆ తరువాత సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాల విజయాలతో బిజీ హీరోగా మారిపోయాడు. రాజ్ తరుణ్ తో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు అనుకున్నారు. అయితే ఈ హీరో మాత్రం కథే ముఖ్యమంటూ పట్టు బట్టాడు. అదీ నిజమే కానీ పెద్ద బ్యానర్లలో సినిమా అవకాశాలు వచ్చినప్పుడు ఏదొక విధంగా సెట్ చేసుకోవాలే కానీ అవకాశాలు వదులుకోకూడదు. ఎందుకంటే ప్రమోషన్స్ విషయంలో పెద్ద బ్యానర్స్ తీరు వేరే రకంగా ఉంటుంది. ప్రస్తుతం సినిమాకు ప్రమోషన్స్ చాలా ముఖ్యం. చిన్న సినిమా అయినా.. ప్రమోట్ చేస్తేనే హిట్ అయ్యేది.

కానీ రాజ్ తరుణ్ బ్యానర్లను పట్టించుకోవడం లేదు. తనకు నచ్చినవే చేస్తున్నాడు. అలా అని సినిమాలు లేవని కాదు. కానీ దిల్ రాజు, గీతా ఆర్ట్స్ బ్యానర్ లలో తను చేయాల్సిన సినిమాలు విజయ్ దేవరకొండకు వెళ్లిపోయాయి. యు.వి.బ్యానర్ లో కూడా విజయ్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు, మూడు పెద్ద బ్యానర్ల్లో సినిమాలు చేస్తున్నాడు. రాజ్ తరుణ్ కి మాత్రం ఇలా సినిమాలు చేయడం కుదరడం లేదు. విజయ్ పెద్ద డైరెక్టర్లతో సైతం సినిమాలు చేస్తున్నాడు. రాజ్ తరుణ్ కి మాత్రం ఆ అవకాశం ఇప్పటికీ రాలేదు. ఇకనైనా.. తరుణ్ ఆచితూచి అడుగులు వేస్తే తనకే మంచిది.