రత్ససన్ అత్యద్భుతమన్న రజనీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనను సర్‌ప్రైజ్‌ చేశారని తమిళ హీరో విష్ణు విశాల్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం “రత్ససన్‌” లో అమలాపాల్‌ హీరోయిన్‌. రామ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గిబ్రన్‌ సంగీతం అందించారు. సైకో థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన రజనీ విష్ణుకు ఫోన్‌ చేశారట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “ఒకే ఒక్క సూపర్‌స్టార్‌ రజనీ ఫోన్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసినప్పుడు సంతోషంతో గంతులేశా. “రత్ససన్‌” అత్యద్భుతంగా ఉంది, పోలీసు యూనిఫాంలో ఫిట్‌గా ఉన్నావు, చక్కటి హావభావాల్ని పలికించావు. నీతో దర్శకుడు కాంబినేషన్‌ బాగుంది అని చెప్పారు” అంటూ విష్ణు ట్వీట్‌ చేశారు.

రజనీ ఇటీవల “పేటా” సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. ఇందులో సిమ్రాన్‌, త్రిష, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సన్‌ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్‌ బాణీలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.