రాళ్లపల్లి నటనంటే నాకెంతో అభిమానం: చిరంజీవి

ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి మృతిపై మెగాస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాళ్లపల్లితో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తొలిసారి చెన్నైలోని వాణి మహల్‌లో నాటకాలు వేస్తున్నప్పుడు ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు. రాళ్లపల్లి నటనను తానెంతో అభిమానించేవాడిని. చెన్నైలో తొలిసారి నేను ఆయన నటనను
స్టేజ్‌పై చూసి ముగ్ధుడినయ్యా. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత రాళ్లపల్లి వెండి తెరపైకి వచ్చారు. నాతో కలిసి పలు సినిమాల్లో నటించిన సందర్భంలో ఆయనతో అనుబంధం ఏర్పడింది.

రాళ్లపల్లి ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆయన చక్కని స్నేహశీలి.. చాలా రోజుల తర్వాత ఆ మధ్య ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాం. ఆ సందర్భంలో ‘ఎలా ఉన్నావు మిత్రమా?’ అంటూ ఇద్దరం ఒకరినొకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలోనే ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. రాళ్లపల్లి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని చిరంజీవి అన్నారు.