41 ఏళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి.. చరణ్‌ శుభాకాంక్షలు

మెగాస్టార్‌ చిరంజీవి నటుడిగా సినీ కెరీర్‌ ప్రారంభించి నేటితో 41 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. తండ్రితో కలిసి అప్యాయంగా దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

‘సినిమా, నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం నాన్న. సినిమాల్లో 41 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమలో 41 ఏళ్లుగా అందరికీ స్ఫూర్తిగా నిలిచి, విజయవంతమైన ప్రయాణం చేసినందుకు శుభాకాంక్షలు’ అంటూ గర్వంగా ఉంది అనే హ్యాష్‌ట్యాగ్‌ను చరణ్‌ జత చేశారు.

కాగా చిరంజీవి ప్రస్తుతం తన 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.