జయలలితగా రమ్యకృష్ణ.. క్వీన్‌ ట్రైలర్‌ విడుదల


సినీ నటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఆమె బయోపిక్‌ను రూపొందించడంలో పలువురు దర్శకులు తలమునకలై ఉన్నారు. ఇటీవలే ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలోని ‘తలైవి’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మరోపక్క గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దర్శకత్వంలో ‘క్వీన్‌’ పేరిట వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో జయలలితగా రమ్యకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు.

అయితే, జయలలిత చదువుకునే రోజుల నుంచి ఆమె పాత్రను చూపించిన చిత్ర బృందం విద్యార్థినిగా, నటిగా ఇలా ఒక్కో దశలో ఒక్కో నటితో ఆ పాత్రలను చూపించారు. చివరిగా రాజకీయ జీవితం నుంచి జయలలితగా రమ్యకృష్ణ కనిపించారు. డిసెంబరు 14వ తేదీ నుంచి ‘క్వీన్‌’కు సంబంధించిన అన్ని ఎపిసోడ్‌లు ‘ఎంఎక్స్‌ ప్లేయర్‌’ ద్వారా వీక్షించవచ్చని చిత్ర బృందం తెలిపింది.