రానా, సాయిపల్లవి ‘విరాటపర్వం’ మొదలైంది

రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రానికి ‘విరాటపర్వం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శనివారం ఉదయం ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేశ్‌ క్లాప్‌ కొట్టారు. గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. సినిమా స్క్రిప్టును సురేశ్‌బాబు దర్శకుడికి అప్పగించారు. కాగా ఈ పూజా కార్యక్రమానికి రానా, సాయి పల్లవి హాజరు కాలేదు.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ఎల్వీ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా విరాటపర్వం సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి డీగ్లామర్‌ పాత్రలో కనిపించబోతుందట. 1992 నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. నిజ జీవిత కథ ఆధారంగా పొలిటికల్‌ ప్రేమకథగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రేమలో విఫలమై, నక్సలైట్‌గా మారిన యువతిగా సాయిపల్లవి, రాజకీయ నాయకుడిగా రానా సందడి చేయనున్నట్లు చెబుతున్నారు.