రష్మిక మందన్నకు అక్కడ భారీ కటౌట్లు… పాలాభిషేకాలు

రష్మిక మందన్న… టాలీవుడ్‌లో .. నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసి కుర్రకారు గుండెలను కొల్లగొట్టేసింది. ఇక్కడ లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ రెండేళ్ల క్రితమే కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఇదే ఆమె మొదటి సినిమా. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి, అప్పుడే ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకుంది. అయితే ఆ తర్వాత వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిపోయిందనుకోండి… అది వేరే విషయం. అయితే రష్మిక శాండల్‌వుడ్‌లో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

తాజాగా దర్శన్ హీరోగా నటించిన ‘యజమాన’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది రష్మిక. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలై, మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.17.50 కోట్లు వసూలు చేసి రికార్డు కూడా క్రియేట్ చేసిందీ సినిమా. అయితే అదంతా పెద్ద విషయం కాదు గానీ ఈ సినిమా విడుదల సందర్భంగా రష్మిక కోసం ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. మైసూర్ సిటీలో రష్మిక కోసం థియేటర్ ముందు ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేసిన ఆమె అభిమానులు… పాలాభిషేకాలు కూడా చేశారు.

స్టార్ హీరోలకు తప్ప హీరోయిన్లకు థియేటర్ల ముందు పెద్దగా కటౌట్స్ కనిపించవు. శాండల్‌వుడ్‌లో అయితే హీరోయిన్లను పెద్దగా పట్టించుకోరు కూడా. అలాంటిది రష్మిక భారీ కటౌట్‌తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో యూత్‌లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న… ఆ సినిమా తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘ఛమక్’ అనే మరో రెండు సినిమాల్లో నటించింది. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించాయి. దాంతో కన్నడిగులకు ఆరాధ్య దేవతగా మారిపోయింది రష్మిక.

శాండల్‌వుడ్‌లో బీభత్సమైన క్రేజ్ వచ్చిన తర్వాతే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ‘ఛలో’ సినిమా ఘనవిజయం సాధించడంలో రష్మిక పాత్ర కూడా చాలా ఉంది. క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్‌తో యూత్‌కు బాగా దగ్గరైంది రష్మిక. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీత గోవిందం’ సినిమా చేసింది రష్మిక. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. తనదైన యాక్టింగ్‌తో పాటు గ్లామరస్‌ లుక్స్‌తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్- రష్మిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.

కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ రష్మికనే హీరోయిన్‌ గా నటిస్తుంది. నితిన్ నటిస్తున్న ‘భీష్మ’ మూవీలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక… కన్నడలో ‘పొగరు’ అనే సినిమా చేస్తోంది.