సెన్సార్ బోర్డుపై కేసు వేస్తానంటున్న రామ్‌ గోపాల్‌ వర్మ !

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’‌. ఎన్టీఆర్‌ జీవితం‍లోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డ్ నిరాకరించిందని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వెల్లడించారు.

తొలి దశ పోలింగ్‌ (11-04-2019) పూర్తయ్యే వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదంటూ సెన్సార్‌ బోర్డ్‌ తనకు లెటర్‌ ఇచ్చినట్టుగా తెలిపిన వర్మ, ఈ పరిణామాలపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్టుగా వెల్లడించారు. సెన్సార్‌ బోర్డ్‌ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు.

రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలతో కలిసి రామ్‌ గోపాల్‌ వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు అగస్త్య మంజు మరో దర్శకుడు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటిస్తుండగా, లక్ష్మీ పార్వతిగా యగ్న శెట్టి నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్‌ కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.