Homeపొలిటికల్Telangana Anthem: ఆయన పాడటానికి 'నాటు నాటు' పాట కాదు.. ముదురుతున్న వివాదం

Telangana Anthem: ఆయన పాడటానికి ‘నాటు నాటు’ పాట కాదు.. ముదురుతున్న వివాదం

Telangana Anthem

Telangana Anthem: జూన్ 2, 2024న తెలంగాణ 10వ వార్షికోత్సవాన్ని విస్తృతంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఒరిజినల్ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ గీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కీరవాణి గీతాన్ని ఎలా కంపోజ్ చేయాలనే దానిపై చర్చించారు. అయితే ఈ అంశంపై ప్రతిపత్రక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన రాష్ట్ర గీతాన్ని ఆంధ్రా ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్‌తో ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా.. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు. తెలంగాణ కవులపై ఆంధ్రా సంగీత దర్శకుల పెత్తనం ఇంకెత కాలమని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘జయ జయ హే తెలంగాణ’ పాట నాటు నాటు కాదని BRS లీడర్ డా.ఆర్.ఎస్.ప్రవీణ్ ఉద్ఘాటించారు.

‘అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది ?? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం ? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక ??

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇదీ “నాటు నాటు” పాట కాదు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం. ఒక రణ నినాదం. ధిక్కార స్వరం. అందెశ్రీ గారిచ్చిన ఒరిజినల్ ట్యూన్‌తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించింది.

ఉస్మానియా యూనివర్సిటీ లో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలాపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకిది తెలియదు. నేనారోజు అక్కడ ఉన్న కాబట్టి చెబుతున్నా.

టాలీవుడ్ వేరు.. తెలంగాణ ఉద్యమం వేరు. టాలీవుడ్ వినోదం కోసమే.. తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో తెలంగాణ హృదయాలన్నింటిని ఒకచోట చేర్చిన భావోద్వేగాల మాల. పాపం అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నడు. మీరేం చేసినా భరిస్తున్నడు. ఆంధ్రా సంగీత విద్వాంసులు మిమ్మల్ని ఆకట్టుకుంటే.. దయచేసి ఏపీకి వెళ్లి అక్కడ సీఎం అవ్వండి.

మీరు తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రజలారా.. జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందమా? లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందమా అని ప్రజలే తేల్చుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!