నిర్మాతకు పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సాయిపల్లవి..!

సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే నిర్మాతలు నష్టపోతుంటారు. వీరికి అండగా నిలవడానికి హీరోలు తమ పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ దారిలో హీరోయిన్‌ సాయిపల్లవి నడిచినట్లు తెలుస్తోంది. ఆమె నటించిన తాజా సినిమా ‘పడి పడి లేచె మనసు’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. శర్వానంద్‌ హీరోగా పాత్ర పోషించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. సినిమా మంచి టాక్‌ అందుకున్నప్పటికీ.. బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత నష్టపోయారట. దీన్ని తెలుసుకున్న సాయిపల్లవి తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు హీరోలు ఇలా చేశారని, తొలిసారి ఓ నటి పారితోషికం వెనక్కి ఇచ్చారని అంటున్నారు.

మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో సాయిపల్లవిగా నటిగా పరిచయం అయ్యారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇందులో ఆమె డ్యాన్స్‌, నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల ధనుష్‌కు జోడీగా సాయిపల్లవి నటించిన ‘మారి 2’ విడుదలై మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె సూర్య సరసన ‘ఎన్జీకే’ సినిమాలో నటిస్తున్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్‌ మరో హీరోయిన్‌. మలయాళ నటుడు ఫాజిల్‌ కొత్త సినిమాలోనూ సాయిపల్లవి నటించనున్నారు.