‘కొలవెరి..’ని బీట్‌ చేసిన సాయిపల్లవి ‘వచ్చిండే..’

తమిళ స్టార్‌ ధనుష్‌ను నటి సాయిపల్లవి బీట్‌ చేసింది. ఇప్పటి వరకు దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న పాటగా ధనుష్‌ ‘కొలవెరి..’ ఉంది. ఈ పాటను ధనుష్‌ రాసి, ఆలపించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. 2011 నవంబరులో విడుదలైన ఈ పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. చాలా మంది సంగీత అభిమానులు ఈ పాటకు పేరడీలు తయారు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘కొలవెరి..’ ఓ సంచలనంలా మారింది. ఈ పాటకు ఏడేళ్లలో 172 మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. 1.4 లక్షల మంది పాటను లైక్‌ చేశారు.

అయితే ఇప్పుడు ‘కొలవెరి..’ పాటని సాయిపల్లవి, వరుణ్‌తేజ్‌ నటించిన ‘వచ్చిండే..’ పాట బీట్‌ చేసింది. 2018 సెప్టెంబరులో (యూట్యూబ్‌) విడుదలైన ఈ పాటలో సాయిపల్లవి తన చక్కటి స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శక్తికాంత్‌ కార్తిక్‌ పాటకు సంగీతం సమకూర్చగా మధుప్రియ ఆలపించింది. ఈ పాట ఇప్పుడు 173 మిలియన్ వ్యూస్‌తో అత్యధిక మంది చూసిన దక్షిణాది పాటగా కొత్త రికార్డు సృష్టించింది. 4.18 లక్షల మంది ఈ పాటను లైక్‌ చేశారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయమని నెటిజన్లు ఈ పాటను ఉద్దేశించి కామెంట్లు చేశారు.

ధనుష్‌, సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్‌తో చక్కటి వసూళ్లు రాబట్టినట్లు విశ్లేషకులు తెలిపారు. ఇందులోని ‘రౌడీ బేబీ..’ అనే పాటకు కూడా ప్రేక్షకాదరణ లభించింది. ఇటీవల విడుదల చేసిన ఈ పాట వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది.