పెళ్లిపై సాయిపల్లవి షాకింగ్‌ కామెంట్స్‌

హీరోయిన్‌ సాయిపల్లవి పెళ్లిపై షాకింగ్‌ కామెంట్‌ చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విలేకరి ఆమెను వివాహం గురించి ప్రశ్నించారట. దీనికి ఆమె చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. నాకు నా తల్లిదండ్రులతోనే ఉండాలని ఉంది. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది. పెళ్లి జరిగితే అనుకున్నట్లు వారి బాగోగులు చూసుకోలేను. అందుకే జీవితంలో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నా’ అని అన్నారట. దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త వెబ్‌సైట్లలో వైరల్‌ అవుతోంది.

సాయిపల్లవి ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. అందులో ఆమె హావభావాలు, డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తర్వాత ‘ఎంసీఏ’, ‘కణం’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలతో ఆమె అలరించారు. ప్రస్తుతం ‘ఎన్జీకే’ సినిమాలో నటిస్తున్నారు. సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య హీరోగా నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మరో హీరోయిన్‌. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం శనివారం ఉదయం ప్రకటించింది.

అదేవిధంగా మలయాళంలో ఫాహద్‌ ఫాసిల్‌ సినిమాలోనూ సాయి పల్లవి నటిస్తున్నారు. మరోపక్క తెలుగులో ఆమె కొత్త ప్రాజెక్టు ఖరారైనట్లు సమాచారం. వేణు ఉడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఇందులో సాయిపల్లవి నక్సలైట్‌గా, రానా పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.